హైదరాబాద్, వెలుగు: గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని డీజీపీ సీవీ ఆనంద్ పోలీసు అధికారులను ఆదేశించారు. మండపాల ఏర్పాటు కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు, జియోట్యాగింగ్, టీజీ కాప్ యాప్‌లో అప్డేట్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించారు. ఈ నెల14న ప్రారంభమయ్యే ఉత్సవాలు.. 25న గణేశ్ విగ్రహాల నిమజ్జనంతో ముగియనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉత్సవాల ఏర్పాట్లపై సోమవారం డీజీపీ కార్యాలయం నుంచి ఎస్సైలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముందస్తు ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.
గణేశ్ మండపాల కోసం ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్
గణేశ్ మండపాల వివరాలను సేకరించి పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి తెచ్చినట్టు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. మండపం ఉన్న ప్రదేశం, నిర్వాహకులు, కమిటీ సభ్యులు, నిమజ్జనానికి వినియోగించే వాహనాల వివరాలను అందులో నమోదు చేయాలని సూచించారు. ఎస్‌హెచ్‌వోలకు ప్రత్యేక లాగిన్లు ఇచ్చినందున మండపాల వద్ద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, సీపీలు, డీసీపీలు, ఎస్పీలు మండపాలను సందర్శించి వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు.
మండపాల వద్ద వలంటీర్ల ఏర్పాటు, సీసీ కెమెరాలు తదితర ఏర్పాట్లు చేయాలని సూచించారు. అవసరమైన చోట బాంబు, డాగ్ స్క్వాడ్లను వినియోగించాలని ఆదేశించారు. జియో ట్యాగింగ్, తనిఖీల వివరాలను టీజీ-కాప్ ప్లాట్‌ఫాంలోనూ అప్లోడ్ చేయాలన్నారు. ఈ సమావేశంలో టెక్నికల్ సర్వీసెస్ డీజీ వీవీ శ్రీనివాసరావు, ఇంటెలిజెన్స్ ఐజీ కార్తికేయ, మల్టిజోన్–-1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, టీస్పార్క్ ఎస్పీ రూపేశ్, ఏఐజీ రమణకుమార్, హైదరాబాద్ డీసీపీ అవినాశ్ కుమార్, డీసీపీ విక్రాంత్‌కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
